(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)

 శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం - 1
1వ భాగం పాటలు  (1 నుండి 25): https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/1-01-25.html 
2వ భాగం పాటలు (26 నుండి 50):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/2-25-50.html
3వ భాగం పాటలు (51 నుండి 75):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/3-51-75.html
4వ భాగం పాటలు (76 నుండి 100):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/4-76-100.html
5వ భాగం (101 నుండి 125):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/5-101-125.html
6వ భాగం (126 నుండి 150):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/05/6-126-150.html
7వ భాగం (151 నుండి 175):  https://srigurushyamcharanbaba.blogspot.com/2024/06/7-151-175.html


శ్యామ సుధా పాటలు
పాటల సూచిక


0) పరమం పవిత్రం

00) మంగళం హారతి


1) నాకేది మంచిదో

2) పరాభక్తి

3) గురువరా నను కావరా

4) చిదంబరేశ్వరా

5) వదలను నిను వదలను


6) శ్రవణము లోపమా

7) బాబా నామమే

8) మధురం మధురం

9) ఈ జీవిత యాత్రలో

10) నీ కొరకై నిను


11) నీ దయ గలిగిన కాని దేముంది

12) నీ వేరా నా ప్రాణము

13 నిను నమ్మితిరా

14) అనంత మహిమాన్విత

15) నీకు న్యాయమా


16) నీ సేవకునిగ

17) నీ దయయే నా బ్రతుకయ్యా

18) నా పూర్వ జన్మ పుణ్యఫలమొ

19) నాతో పంతమా

20) నీ ముందు నేనెంత యనెడి భావన


21) నీకున్న బలమెంత

22) దత్త శరణం సాయి శరణం

23) అర్ధించుచుంటినని

24) అలిగితివో ఆగ్రహించితివో

25) ఆటలనాడుచు నుంటివి దేవ! (Part-1)


1) నాకేది మంచిదో

నాకేది మంచిదో నా కేది చెడుపో

నా కంటే బాగుగా నా స్వామికెరుక


అతని చేరిన వారి కతడాయ తలితండ్రి

అతని బిడ్డను నేను ఇతరము నా కేల ||నా కేది||


స్వామి నది ఇది అడుగ దాసునకు ధర్మమా

అన్ని తెలిసిన స్వామి చేసేది నా కొరకే ||నా కేది||


2) పరాభక్తి

పరాభక్తి నా మదిలో నిలిపి నన్ను దయతోకావరా

శ్రీకరేశ్వర హే కరుణాకర కృపాకర ప్రభు గురువరా ॥పరా||


విశ్వధారా విశ్వరూప విమలచరిత గురువరా

ప్రాణాధారా ప్రాణిరూపా పతితపావన గురువరా ॥పరా||


జీవాధారా జీవరూప జగత్సాక్షి గురువరా

జ్ఞానాధారా జ్ఞానరూప జగత్ ప్రభో గురువరా ॥పరా||


నీ చరణములే శరణము శరణము

నీ నామామృతమే నాకు శరణము ॥పరా||


నీ కృపయే నాకు జీవనము

నీ కరుణయే శ్యామాదుల కభయము ॥పరా||


3) గురువరా నను

గురువరా నను కావరా

గురువరా నను బ్రోవర

శ్రీ గురు నీవే శరణము

సద్గురు నీవే దిక్కు ||గురు||


నీ నామము పలుక నీయుమా

నీ రూపము నా మదిలో నిలుపుము

నీ మార్గమునందు నడుపుము

నీ దరికే నన్ను జేర్చుము ||గురు||


ఎవరియందున ద్వేషముంచక

దేనియందును కోరిక యుండక

నీదు సూక్తుల కనుగుణముగా

నన్ను నడుపుము గురువరా ||గురు||


దోషములను జేయనీయకు

దురాలోచన రానీయకు

దుర్మార్గములోన ఉంచకు

నీ మార్గము నందు ఉంచుము ||గురు||


అణువు అణువున నీవు గలవను

అనుభవములను కృపతో నొసగుము

నేను నాదను భావములను

సమూలముగా పెరికి వేయుము ||గురు||


సత్యమును నను పలుక నీయుము

ధర్మ మార్గమునందు నడుపుము

పరమ ప్రేమతో నన్ను మలచుము

నీదు సేవలో నన్ను నిలుపుము ||గురు||


మాయలో పడి ఉన్నవాడను (దానను)

మాతవై నను పాలింపుము

నీ చెంతకు చేర్చుకొనుము

నీ లోనే నిలుపుకొనుము ||గురు||


దాసనాయకి దాససేవిత

దాసవందిత త్రినయనీ

దాససన్నుత సద్గుణాలయ

నీదు చరణములే శరణము ||గురు||


4) చిదంబరేశ్వరా

చిదంబరేశ్వరా శ్రీకరేశ్వరా

ఆదరమున కావరా

అరుణాచలేశ్వరా

అరుణాచల శివ అరుణాచల //2//


నమ్మినానురా నీ పద కమలముల

ప్రేమ మీద చేరదీసి కావవేమిరా //అరుణాచల//


జపము నెఱుఁగను నేను తపము నెఱుఁగను

మంత్రమెరుగను నేను తంత్రమెరుగను

ధ్యానమెరుగను సుజ్ఞాన మెరుగను

ధ్యాన రూప జ్ఞానరూప అరుణాచలేశ్వర //అరుణాచల//


స్నేహమెరుగను నేను ప్రేమ నెరుగను

జీవమెరుగను నేను భావమెరుగను

దైవమెరుగను నేను దెయ్యమెరుగను

ఏమియు ఎరుగని నన్నేటుల భ్రోతువో //అరుణాచల//


ఏది ఎందుకెపుడు ఎటుల చేసినాడనో

దేనికెందుకిపుడు ఇటుల జరుగుచున్నదో

తెలియలేదురా తెలివిలేదురా

ధ్యాన రూప జ్ఞానరూప అరుణాచలేశ్వర //అరుణాచల//


నా కనులలో నీవు కరిగిపోవా

నా మనసులో నీవు నిండిపోవా

నా పలుకులో నీవు నిలచిపోవా

నాలోన లోలోన అణిగిపోవ //అరుణాచల//


నా లోన యిమిడి ఉన్నది నీవే కదా

నీ లోన నిలచి ఉన్నది నేనే కదా

నీవు నేను వేరు కాదు, కాదనుచు తెలుపవా

శ్యామనాథ రమణనాథ అరుణాచలేశ్వర //చిదంబరేశ్వరా//


5) వదలను నిను వదలను

వదలను నిను వదలను నే వదలను వదలను వదలను వదలను సాయి

వదలక నిను వదలక నే వదలక వదలక వదలక వదలక

చేకొనుమయ్యా శ్రీతజన మాయి

సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ //2//


మానవ జన్మను నొసగితివయ్య

మనుసునొకటి కల్పించితివయ్య

మాయలోన నను ముంచితివయ్య

మహా చిత్రము చేసేదవయ్య //వదలను//


సంసారము యొకటి కల్పించితివి

సంఘములో పడవేసితివి

సమస్యలెన్నో సృష్టించితివి

సతమత అగుటకు చేసితివి //వదలను//


బాధ్యతలను భారీయించెదనంటివి

నిను శరణన్నచో గాచెదనంటివి

ఎప్పుడు భరించెదవో ఎటుల గచెదవో

శ్యామాదులకు శాంతి నొకగుమా //వదలను//


6) శ్రవణము లోపమా

శ్రవణము లోపమా

స్మరణము లోపమా

మననము లోపమా సాయి

శ్రవణ స్మరణ మన నాడులకందవు

ఇదేమి చిత్రమో సాయి సాయి //శ్రవణము//


పరాయణత్వముతో చేయని

పారాయణము లోపమా

ధ్యేయము నందలి ధ్యాస లేకయే

ధ్యానము చేయుట లోపమా


అవగాహనయే లేక యాంత్రికపు

పూజలు చేయుట లోపమా

అహమును వదలక అటునిటు చూచుచు

ఆర్చించుటయే లోపమా


సదా చరణయే సతతము లేకయే

అతిగా వాగుట లోపమా

సకల జీవులలో నిన్ను చూడకయే

నీవు గలవనుట లోపమా


నిన్ను గూర్చి నేనేమి ఎరుగయే

పరు అని దూరుట లోపమా

శరణు శరణుమను

శ్యామ చరణనుని కరుణతో బ్రోవ భారమా!! //శ్రవణము//


7) బాబా నామమే

బాబా నామమే భవ్య నామము

దీన జనులకు దివ్య నామము

సృష్టి స్థితి లయ తారక నామమ


ఇహపర సుఖముల నోసగెడి నామము

ఇప్సిత్తముల నెరవేర్చేడి నామము

బాధ్యతలను భరించేడి నామము

భవ బంధములను త్రేంచడి నామము


భక్తి జ్ఞానం నొసగేడి నామము

వైరాగ్యమును కలిగించండి నామము

ముక్తి పదమున చేర్చడి నామము

ఆత్మానందం నిలిపెడి నామము


భక్తుడు సతతము స్మరింపు నామము

యోగులు ధ్యానము చేసెడి నామము

సకల దేవతలు జపించు నామము

శ్యామాధులకు తారక నామము


8) మధురం మధురం

మధురం మధురం మన సంబంధం

జన్మజన్మల రుణానుబంధం

జన్మజన్మల విడివడిన బంధం

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం //2//


విడదీసినను విడవలేనిది

కదిలించిన ను కదలలేనిది

తొలగించినను తొలగబోనిది

అమృతమయముగా నిలిచిపోయినది //మధురం//


మరవ దలచినను మరువనీయనిది

మాటల చేతల భాషల కందనిది

తను మన ధనముల మరువజేయునది

ఆనందామృత మందు నిలచునది //మధురం//


సంతస మోసగి రక్షించునది 

సంతస మోసగి సంరక్షించునది

స్మరియించినచో కృప చూపునది అని

ఆత్మీయతతో అలరించునది //మధురం// //సాయిరాం//


మధురం మధురం సాయి సంబంధం

మధురం మధురం సద్గురు బంధం //సాయిరాం//


9) ఈ జీవిత యాత్రలో

ఈ జీవిత యాత్రలో ఎన్నెన్నో పాత్రలు

ఏది ఎందులకు ఉద్భవించునో

ఏది ఎందులకు నిష్క్రమించునో

ఎప్పుడు ఉద్భవించునో ఎటుల నిష్క్రమించునో

తెలియదు తెలియదు తెలియదు మనకు తెలియదు //ఈ జీవిత//


ఎవరికి వారే ఒంటరిగా బ్రతుకలేరని ఎంచియు

రుణాను బంధములను పెంచి

సంబంధములకు స్పందించి

ఒకరినొకరుగా తొడు నీడగా బ్రతుకులు లాగగ

ప్రారబ్దమును అనుసరించు నడుచుచున్నా ఈ నాటక మందునా //ఈ జీవిత//


జరిగెడి దానిని అనుభావించుచు

జరగబోవునది ఊహించుచు

తాను చేసినది విస్మరించుచు

పరులు చేసినది చూపించుచు


మంచికి తానే కారణమనుచు

చెడుకి ఇతరులు కారకులగుచును

కీచులాటలతో పెనుగులాటలతో

బ్రతుకును బరువుగా లాగు చుండెడి //ఈ జీవిత//


సత్యమేమిటో తెలిసినగాని

సంతసమన్నది అర్ధం కాదు

ఆశలు ధ్యాసలు అవేశములు

అర్ధరహితములనుచు తెలియదు


త్రికరణ శుద్దితో సత్యాన్వేషణ

మార్గాములో మునిగిన కానీ

బాధలు తొలగవు బంధములుడవు

జగదీశ్వరుడు గోచరించడు //ఈ జీవిత//


సత్సంగములో ఉండినగాని

సత్పురుషుల సేవించినగాని

సత్ గ్రంధాలములు చదివినగాని

సదాచరణతో ఉండినగాని

సత్యము తెలియదు సంతసముండదు

సదాలోచనలు అసలే కలుగావు


సత్యమునెరిగి చేసేడి సద్గురు

శ్యామ సాయిని సమాశ్రయింపుమా //ఈ జీవిత//


10) నీ కొరకై నిను

నీ కొరకై నిను ప్రేమింప నీయుము

నీ కొరకై నను జీవింప నీయుము


అజ్ఞానమును ధ్వంసము చేయుమా

పతిత పావనా సాయి తండ్రి

పతిత పావనా శ్యామచరణా

పతిత పావనా వందిత చరణా


శ్రీ గురు నామమే భయమును బాపును

శ్రీ గురు సేవయే ముక్తి నొసగును

శ్రీ గురు కృపయే మన జీవితమూ

గురు సూక్తుల ఆచరణయే శ్రేష్ఠము


సద్గురు నామమే భవతారకమూ

సద్గురు స్మరణయే భయ నాశకము

శ్రీ గురు దేవా అని స్మరియించిన

నాలో నిలచి నను నడిపించును


తల్లి తండ్రి గురు దైవము తానై

శాంతి సౌఖ్యముల నాకందించును

శ్రీ గురు దేవా అని పిలిచినచో

పరుగు పరుగున నాదరి చేరును


బాధ్యతలన్నియు తానే భరించును

తన మార్గములో నను నడిపించును

నిను నమ్మినచో భయము నాకేల

సమర్థ సద్గురు సాయి దేవా


నిను భక్తితో సదా స్మరించగా

కృప చూపుము నా సాయి దేవా


పంచేంద్రియములు పంచప్రాణములు

అహంకారము మనసు బుద్దులను

నీ సేవలకై వినియోగింపగ

కృప జూపుము నా సాయి దేవా


నీ కొరకై నిను ప్రేమింప నీయుము

నీ కొరకై నను జీవింప నీయుము

నీ సేవలనే చేయ నీయుము

నీ కృపతో మము నడువ నీయుము


కరుణా భరణా కల్మష హరణా

ప్రేమ ప్రదాయక కల్మష నాశక

నిస్వార్ధముగా నడువ నీయుమా

శ్యామ పోషక శాంతి నొసగుమా


పతిత పావన శ్యామ చరణా

పతిత పవనా వందిత చరణా


11) నీ దయ గలిగిన

నీ దయ గలిగిన కాని దేముంది

ఇహ పరములలో సాయీ

నీ కృపగలిగిన రాని దేముంది

శ్యామాదులకు సాయీ ||నీ||


నీ లీలల కీర్తించిన గలుగును

అనంత ధైర్యము సాయీ

నీ నామము స్మరియించిన గలుగును

అమితానందము సాయీ ||నీ||


నిను పూజించిన నిశ్చలముగ

మది నీపై నిలుచును సాయీ

నిను సేవించిన నిశ్చయమౌ

మది నిష్ఠ సబూరులు సాయీ ||నీ||


నిను ఆరాధించిన నే తెలియును

అసలు తత్వము సాయీ

నిను ప్రేమించిననే దెలియును

పరమ సత్యము సాయీ ॥నీ॥


నిను నమ్మినచో కలుగును

భువిలో అష్టసిద్ధులు సాయీ

నిను శరణన్నచో ఆనందింతురు

అష్టభోగముల సాయీ ||నీ||


నమ్మిన వదలక శరణము నొసగుచు

కరుణింతువు గద సాయీ

నీ చరణములే శరణము శరణము

సంకట హరణా సాయి ||నీ||


12 నీ వేరా నా ప్రాణము

నీ వేరా నా ప్రాణము

నీవేరా నా జీవము


ప్రాణము, జీవము,

రూపము, ధ్యానము,

నామము సర్వము

నీవేరా..... నీవేరా .....


సాయిరాం.... రాధేశ్యాం .... ॥నీ వేరా॥


మధురాతి మధురం నీదు నామము

మహిత మనోహరం నీదు రూపము

మహిమోపేతము నీ కీర్తనము

మనసానందము బ్రహ్మనందము


దైవ స్వరూపా... సాధు స్వరూపా...

జీవ స్వరూపా... యోగ స్వరూపా...

ప్రేమ స్వరూపా... జ్ఞాన స్వరూపా...

విశ్వ స్వరూపా... దత్త స్వరూపా....


సాయిరాం... రాధేశ్యాం... ॥నీ వేరా॥


రోమ రోమమున సాయి సాయి యన....

అణువణువున బాబ బాబాయన

అన్ని వేళలలో అంతరంగమున

నీవే నిలిచి నన్ను కావరా ॥నీ వేరా॥


నీ దయ లేక బ్రదుక జాలరా...

నీ కృపలేక మనజాలనురా..

ముక్తి దాయకా, భక్తి దాయకా..

శక్తిదాయకా భుక్తిదాయకా...


సాయిరాం...... రాధేశ్యాం... ॥నీ వేరా॥


ఎందులకీ భువి నేనడుగిడితినో

కామక్రోధముల వలలో పడితినో

అజ్ఞానముతో మసలు చుంటినో

అసలు సత్యమును తెలియనైతినో


నీ చేతిలో కీలు బొమ్మనై

నీ ఆటలో తోలు బొమ్మనై

మార్గమెరుగని మట్టి బొమ్మనై

పడియుంటినిగా శ్యామ సన్నుతా


సాయిరాం...... రాధేశ్యాం... ॥నీ వేరా॥


13) నిను నమ్మితిరా

నిను నమ్మితిరా నీరజ నయనా

కరుణించుమా కమలలోచనా


ప్రగాఢమగు విశ్వాసము నోర్పుల గలిగిన

వారిని రక్షింతువనీ

నీవే దిక్కని నమ్మిన వారల బాధ్యతల నెల్ల

భరియింతువనీ

పూర్వ జన్మ సంసాదితమౌ ఈ పాప ఫలితముల

వలలో జిక్కితి

పాప ఫలితములు తొలగింతువనీ జ్ఞాన వైరాగ్యంబుల

నొసగెదవనీ

ముక్తి మార్గమున నడపింతువనీ సమర్థ సద్గురు

దైవము నీవని

ఆర్తితో బిలచిన ఆదుకొందువని ఆవేదనలను

తొలగింతువనీ

కోరిన కోర్కెల దీర్చుచుందువని కొంగు

బంగారపు పెన్నిధి నీవని

దలచిన వారికి కనిపింతువనీ, బిలచిన

వారితో పలుకు చుందువని ||నిను॥


14) అనంత మహిమాన్విత

అనంత మహిమాన్విత గురుదేవా.

ఆనందామృత చిన్మయ భావా || గురుదేవా||

సద్గురు దేవా.. సమర్థసద్గు రుసాయిదేవా ||అనంత||


అనంత కోటి బ్రహ్మాండ నాయకా

అనంత గుణ గణ ఆగమ వినుత

అనంత సురగణ మునిజన వందిత

అనంతానంత అమృతానంద || అనంత ||


కామ క్రోధ మద మత్సర నాశక

లోభ మోహ సంశయ వినాశక

చిత్తచాంచల్య కర్మనాశక

సుజన పూజిత సుందరనాయక ॥ అనంత ॥


భక్తి శక్తి చిచ్భిక్తి పద్రాయక,

జ్ఞాన వైరాగ్య ముక్తిదాయక,

సచ్చిదానంద విశ్వవిధాయక,

శ్యామ సేవిత సద్గురు నాయక ॥ అనంత ॥


15) నీకు న్యాయమా

నీకు న్యాయమా నీరజనయనా

ఇక్కట్టుల కలిగించ బాధించ ॥నీకు॥


సర్వము నీ సంకల్పమె యందువు

యీ బాధలు నా పాపమందువు

నేనెవరో? పాప మేల జేసితినో?

తెలియగ నీయవు శోధించెదవు ॥నీకు॥


సమస్యలెన్నియో సృష్టించెదవూ

పరిష్కరింపక వేధించెదవు

తనువు మనసులను హింసించెదవు

ఎందుకో నా బ్రతుకుతో చెలగాటము ॥నీకు॥


సర్వభారముల మోనెదనందువు.

భక్తి గ పిలిచిన పలికెద నందువు

ఎపుడు మోసెదవు ఎప్పుడు పలికెదవు

బాధ్యతల దించి శాంతి నొసగెదవు ॥నీకు॥


అసమర్థుడనని ఆడించెదవా

అవివేకి ననుచు పరిహసింతువా

అజ్ఞాని ననుచు నిరాదరింతువా

అహంకారినని అణచి వేతువా ॥నీకు॥


నను సృజియించిన దీవయేగదా

ఈ బ్రతుకంతా నీదయయేగదా

కరుణ జూపి కడదేర్చగ రావే

శ్యామ హృదయ వాసా సాయీ ॥నీకు॥


16) నీ సేవకునిగ

నీ సేవకునిగ నీ బానిసగ

నీ సేవలోన నిరతము నిలుపుము సాయి ॥నీ॥


సర్వము నీ కర్పణము జేయుచు

సకలము నీదేయని మది దలచుచు

సకల విశ్వమున నిన్ను జూచుచు

సంతోషంబు పొందగ చేయుము ॥నీ॥


నీనామామృత పానము జేయుచు

నీ లీలలను గానము జేయుచు

నీ సేవకులకు సేవల జేయుచు

నిరతము సంతసమందున నుంచుము॥నీ॥


ఆశయమీ వై ఆశలు నీవై

ఆచరణ ఆలోచన లీవై

అంతట నీవై అన్నియు నీవై

ఆనందంబు నందింపుము సాయీ ॥నీ॥


నీవే నేనై నేనే నీవై

నిశ్చయ నిశ్చలమగు గతినేనై

నిరుపమానంద ధామము నేనై

వుండగా జేయుము శ్యామ సన్నుతా ॥నీ॥


17) నీ దయయే

నీ దయయే నా బ్రతుకయ్యా

నీ కరుణయే నా జీవితమయ్యా

నీ ప్రేమయే నా సంతసమయ్యా

నా పాపమే సంతాపము లయ్యా ॥నీ॥


పావనమగు నీ దివ్య నామమును

వినగలుగుట నీదయయే గదా

పవిత్రమౌ నీ‌ దివ్య చరితమును

పఠియించుట నీ కృపయే గదా

నీదు లీలలను నిరతము గానము

జేయుటయు నీ కరుణగదా

మంగళకరమౌ నీదు రూపమును

జూచుట నీప్రేమయే గదా ॥నీ॥


నీ నామమే నామనసును స్థిరముగ

నీ దరి నిలిపెడి మంత్రమయా

నీ చరితమే నా భక్తిని దృఢముగ

నీపై నిల్పడి మంత్రమయా

నీ లీలలే నా దుష్కర్మలను దనుమార

గలుగు శస్త్రమయా

నీ రూపమే నా కాత్మ జ్ఞానము నొసగి

రక్షించు నేత్రమయా ॥నీ॥


నీదయ కలుగని, క్షణమొక యుగమై

బ్రదుకు దుర్భరమగునయ్యా

నీ కరుణలేని నా జీవితమొక

నరకయాతనగ మారునయ్యా

నీ ప్రేమలేని క్షణమున శ్యామచరణుడు

భువి మరి నిలువడయా

శ్రీచరణా భవ భయ హరణా

సంకట హరణా సాయిరమణా ॥నీ॥


నిరామయా నిరంజనా నిర్గుణా సనాతనా

నిగమాగమ వేద వేద్య శ్రీ చరణా మోహనా


18) నా పూర్వ జన్మ

నా పూర్వ జన్మ పుణ్యఫలమొ నీ అనుగ్రహమొ..

నీ పవిత్ర నామమునే వినగలిగితి సాయీ.

నీ దివ్య లీలలనే జదువ గలిగితిని సాయీ

నీ పద భక్తునిగా భువి పిలువబడుచు నుంటి సాయి ॥నా॥


సాధనలను చేయలేదు, తపముల నొనరించలేదు,

యజ్ఞయాగాదుల, నే, నసలే, మదినెరుగలేదు,

నీ నామమె స్మరియించుచు, నీ లీలల జదువు చుండ

అంతమాత్రమునకే, ఎంతో దయ జూపితివి ॥నా॥


అడుగడుగునా ఆడుకొనుచు అదృశ్యముగా గాచుచు

అనవరతము మమ్మెల్లర కరుణతో బ్రోచుచునుంటివి

పావన నామా సాయీ పతిత జనోధ్ధారకా

సదమల హృదయా దేవశ్యామ సుజన పోషకా ॥నా॥


19) నాతో పంతమా

నాతో పంతమా నా పాలి దైవమా సాయీ ॥నాతో॥

సుంత యేని మది శాంతి నిలుపవు వింత వింతగా బాధించెదవు ॥నాతో॥


ఎంతగా నిను ప్రార్థించిననూ ఎంతగా నిను వేడుకొనిననూ

రవ్వంత యేని కరుణ జూపవు ఒక్క సమస్యను పరిష్కరించవు ॥నాతో॥


సర్వ భారముల నీ పరము జేసి సమస్యలను నీ భుజంబుల మోపి

మంచి చెడుగులకు కారణమీవని బలుకుచు భువిలో బ్రతుకుచుంటినని ॥నాతో॥


తామసముతో తడబడు నడుగులతో అలసటతో ఆడంబరములతో

అంతయూ నీదయయేయని బలుకుచు ఆడుచుంటినని అల్పుడ నేనని ॥నాతో॥


దండించిననూ దరి జేర్చిననూ పరీక్షించినను పరిరక్షించిన

నీవుగాక యింకెవరున్నారని ఆశ్రయింతురా శ్యామ సన్నుతా సాయి ॥నాతో॥


20) నీ ముందు నేనెంత

నీ ముందు నేనెంత యనెడి భావన తోడ

ప్రారంభమయినది మన బంధము

నిను వదలి జీవించలేననెడి భావనతో

సాగుచున్నది సాయి అనుబంధము


మధురాతి మధురమౌ ఈ బంధము

మహిత మనోహరపు అనుబంధము

సంతసమ్మొనగూర్చు సంబంధము

విడదీయ లేనిదీ ఋణబంధము ॥నీ ముందు॥


చిత్రాతి చిత్రమౌ సంకెలల లంకెలతో

బ్రతికించుచున్నది బుణబంధము

ఏవేవో కర్మలను ఎట్టెటులో జేయించి

జన్మలొసగుచున్నదీ బంధము


సర్వము కలిగించి సంత సంబుల ముంచి

సాయినే అందించు నీ బంధము

కర్మలెన్నియో తెంచి కర్తవ్యమును త్రుంచి

కడతేర్చు నీ సంబంధమూ ॥నీ ముందు॥


ప్రతి క్షణము ప్రతిప్రాణి పయనించుచుండుటకు

మూలాధారమ్ము ఈ సంబంధము

స్థావర జంగమము లన్నిటికి

హేతువై లోతుగా నున్నదీ అనుబంధము


సకల చరాచర విశ్వమే

తానై సాయిగా శ్యామ చరణాదులను

సాయిలో లీనమ్ము చేసి

హాయిని గూర్చు సంబంధము ॥నీ ముందు॥


21) నీకున్న బలమెంత

నీకున్న బలమెంత బంధుబలగమెంత

చదువు సంధ్యల వెంత శ్యామా?

నీకున్న ధన ధాన్య భోగ భాగ్యము లెంత

సద్గురుని యందు నీ విశ్వాసమెంత

శ్యామా...... ఆ........ ఆ


అహము మోహము లందు వ్యామోహమెంత

కామ క్రోధములందు మమకారమెంత

మద మాత్సర్యములందు సహకారమెంత

నీకు సహకారమెంత ||నీకున్న||


దారా పుత్రాదులతో నీ ధర్మమెంత

ఆహారముల యందు ఆసక్తి ఎంత

సజ్జనులతో మెలుగు సద్భావ మెంత

సకల జీవుల యందు అనురాగమెంత ||నీకున్న||


నాది నాదని బలుకు నీదు తెలివెంత

నాది నీదని బల్కు నీదు మనసెంతా

ఆనందమందుటకు ఆచరణ ఎంత

అసలు నీవెంత నీ అధికారమెంత ||నీకున్న||


22) దత్త శరణం సాయి శరణం

దత్త శరణం సాయి శరణం దత్త సాయి శరణం శరణం ॥ దత్తా సాయి శరణం శరణం సాయి దత్త శరణం శరణం భువనేశ్వరా అఖిలేశ్వరా గుణగంభీరా సాయిశ్వర ॥దత్త॥ దేవకి నందన శ్యామా సాయి దశరథ నందన రామా సాయి శ్యామ సాయి రామా సాయి శ్యామా రామ సాయి సాయి రామా శ్యామ సాయి సాయి సాయి సాయి శ్యామ రామా సాయి సాయి రామా శ్యామా

రామ సాయి రామా సాయి రామా సాయిరామా శ్యామ సాయి శ్యామా సాయి శ్యామా సాయి శ్యామా

మాధవ మురహర శ్యామా సాయి రాఘవ సురవర రామా సాయి

దేవకి నందన శ్యామా సాయి దశరథ నందన రామా సాయి


శ్యామ సాయి రామా సాయి శ్యామ రామ సాయి సాయి దేవకి నందన శ్యామా సాయి శరణం శరణం తవశరణం దశరథ నందన శ్యామ సాయి శరణం శరణం తవ శరణం మాధవ మురహర శ్యామ సాయి శరణం శరణం తవ శరణం రాఘవ సురవర రామా సాయి శరణం శరణం తవశరణం


23) అర్ధించుచుంటినని

అర్ధించుచుంటినని అందలము

పైకెక్కి అవహేళనల పాల జేయకయ్యా


ప్రార్థించు చుంటినని పరిహాసమాడుచూ

పది మందిలో కించ బరచకయ్యా

దేవా...సాయిదేవా రావా నన్ను కావరావా ||అ||


కోర్కెలధికములనుచు కోపమ్ము జెందితివా

ఆశలధికములనుచు ఆయాస పడితివా

కోర్కెలు ఆశలు నీ అధీనములే గదా!

నేర్పుగా నడిపించి నీ దరికి జేర్చమని ||అ||


కాముకుడు వీడనుచు కరుణ మానితివా

మోహ మత్యధికమని మూగబోయితివా.

కామ మోహమ్ములు నీ సంకల్పమేగదా.

సద్భుద్ధులొసగి నీ కరుణ ప్రసరింపమని ||అ||


బలహీనతల వలలోన బందీగ మారాను..

అస్తవ్యస్తపు మార్గముల నడచుచున్నాను.

సర్వభారంబులను నీ పరము జేశాను.

శ్యామ సన్నుత సాయి కావరావే యనుచు ||అ||


24) అలిగితివో ఆగ్రహించితివో

అలిగితివో ఆగ్రహించితివో

మందభాగ్యుడని మదినెంచితివో !

దుర్మార్గమ్ములో జేసిన దోసగుల

క్షమియింపుము కరుణించుముసాయి || అలిగితివో॥


సతతము నీ నామమునేదలపక

సర్వము నీ కర్పణ జేయక

సాయీ సాయీయని సంతాపములలో

బిలచుచు, బలుకుచు, పిడించితినని ॥ అలిగితివో ॥


నాదను భావము లోలోనుండగ,

సర్వము సాయి యిచ్ఛయేయనుచు

బలుకుచు స్వార్ధముతో జీవించుచు,

నీ కపకీర్తిని దెచ్చుచుంటినని, ॥ అలిగితివో ||


అసత్యమాడుచు అహమున దిరుగుచు

అధర్మ మన్యాయముల తో బద్రుకుచు

కామ మోహమ్ముల వలలో గ్రుక్కుచు,

మ్రొక్కుచు నీవేశరణ మంటినని ॥ అలిగితివో ||


ధ్యాన సాధనల జపముల జేయక

నిష్ఠసబూరుల కలిగియుండక

భక్తిశద్ర్ధవిశ్వాసములుండక

శ్యామ చరణుడు సంచరించునని ॥ అలిగితివో ||


25) ఆటలనాడుచు నుంటివి దేవ

ఆటలనాడుచు నుంటివి దేవ!

వేడుక జూచుచు మహానుభావా ॥ఆట॥


ఆటల నాడగ వేడుక జూడగ,

మేమెంతటివారము సాయిదేవా ॥ఆట॥


అహమున ముంచుచు నుంటివి దేవా

మోహము బెంచుచు నుంటివి దేవా

అహమున ముంచుచు మోహము బెంచుచు

ఐహిక చింతల నుంచుచు దేవా ॥ఆట॥


కామమ్ము ను కలిగించుచు దేవా

క్రోధమ్ము ను రెట్టించుచు దేవా

కామ క్రోధ కందకముల ద్రోయుచు,

కష్టములను కలిగించుచు దేవా ॥ఆట॥


మదమును లోలో పెంచుచు దేవా

మత్సరమును కలిగించుచు దేవా

మదమత్సరములలో బడ వైచుచు

మంచిని మరువగ జేయుచుదేవా ॥ఆట॥


స్వార్థంబును మదిబెంచుచు దేవా

లోభంబును కలిగించుచు దేవా

స్వా ర్థలోభముల మదిరగిలించుచు

మాయలలో బడద్రోయుచు దేవా ॥ఆట॥


సకలము నీదని నెంచుచు దేవా

సతతము నిన్నే దలచుచు దేవా

సకలము నీదని సతతము దలచుచు

నున్న శ్యామను గాచుచు దేవా ॥ఆట॥




Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)